దాశరధి కృష్ణమాచార్య / telugu poet Dhasaradhi krishnamaacharya

         దాశరధి-ఆ చల్లని సముద్ర గర్భం



                 దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22 న వరంగల్ జిల్లా చిన్న గూడూరు గ్రామంలో జన్మించారు. ప్రస్తుతం ఈ గ్రామం మహబూబాబాద్ జిల్లాలో ఉంది. బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. ఉర్దూలో మెట్రిక్యులేషను, భోపాల్ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియెట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషు సాహిత్యంలో బియ్యే చదివారు. 


సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మంచి పండితులు. చిన్నతనంలోనే పద్యం అల్లటంలో ప్రావీణ్యం సంపాదించారు. ప్రారంభంలో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా ఉండి రెండో ప్రపంచయుద్ధం సమయంలో ఆ పార్టీ వైఖరి నచ్చక ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి[1] హైదరాబాదు సంస్థానంలో నిజాం అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాలుపంచుకున్నారు.


రచనా ప్రస్థానం:-

ఉపాధ్యాయుడిగా, పంచాయితీ ఇన్స్పెక్టరుగా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేసారు. సాహిత్యంలో దాశరథి అనేక ప్రక్రియల్లో కృషి చేసారు. కథలు, నాటికలు, సినిమా పాటలు, కవితలు రాసారు.


నిజాం పాలనలో రకరకాల హింసలనుభవిస్తున్న తెలంగాణాను చూసి చలించిపోయారు. పీడిత ప్రజల గొంతుగా మారి నినదించారు.
“ రైతుదే తెలంగాణము రైతుదే.ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అని గర్జించారు.
దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు, దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది, దిగిపోవోయ్, తెగిపోవోయ్”అని నిజామును సూటిగా గద్దిస్తూ రచనలు చేసారు.


ఆంధ్రమహాసభలో చైతన్యవంతమైన పాత్ర నిర్వహించి నిజాం ప్రభుత్వం చేత జైలు శిక్ష అనుభవించారు. నిజామాబాదు లోని ఇందూరు కోటలో ఆయన్ని మరో 150 మందితో ఖైదు చేసి ఉంచింది, నిజాము ప్రభుత్వం. ఆయనతోపాటు ఖైదులో వట్టికోట ఆళ్వారుస్వామి కూడా ఉన్నారు. పళ్ళు తోముకోవడానికిచ్చే బొగ్గుతో జైలు గోడల మీద పద్యాలు రాసి దెబ్బలు తిన్నారు. మంచి ఉపన్యాసకులు. భావప్రేరిత ప్రసంగాలతో ఊరూరా సాంస్కృతిక చైతన్యం రగిలించారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాతల్లో ఒకరు.


 1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి అధ్యక్షుడుగా జిల్లాల్లో సాహితీ చైతన్యాన్ని నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా 1977 ఆగష్టు 15 నుండి 1983 వరకు పనిచేసారు. రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతులు గెల్చుకున్నారు. అనేక సినిమాలకు గీతాలు రచించి అభిమానుల్ని సంపాదించుకున్నారు. మీర్జాగాలిబ్ ఉర్దూ గజళ్ళను తెలుగులోకి గాలిబ్ గీతాలు పేర అనువదించారు. తల్లి మీద, తల్లి తెలంగాణ మీద ఆయన రచించిన పద్యాలు ఇప్పటికీ ఎందరికో ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి.




కవితా సంపుటాలు :-

అగ్నిధార

మహాంధ్రోదయం

రుద్రవీణ

మార్పు నా తీర్పు

ఆలోచనాలోచనాలు

ధ్వజమెత్తిన ప్రజ 

కవితా పుష్పకం

తిమిరంతో సమరం

నేత్ర పర్వం

పునర్ణవం

గాలిబ్ గీతాలు

అవార్డులు:-

1967 లో ఆంద్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి
1974 లో కేంద్ర సాహిత్య అకాడమి బహుమతి
ఆంధ్ర విశ్వవిద్యాలయం " కళాప్రపూర్ణ "
వెక్కటేశ్వర విశ్వవిద్యాలయం "డి. లిట్ "

బిరుదులు :-

కవిసింహం
అభ్యుదయ కవితా చక్రవర్తి
ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి 1977 నుంచి 1983 వరకు
ఆంధ్రా కవితా సారధి

మచ్చుకు కొన్ని దాశరథి రచనలు సవరించు
తెలుగుజాతి ఆత్మకథ లాగా ఉంటుంది కింది పద్యం..

ఎవరు కాకతి! ఎవరు రుద్రమ!
ఎవరు రాయలు! ఎవరు సింగన!
అంతా నేనే! అన్నీ నేనే!
అలుగు నేనే! పులుగు నేనే!
వెలుగు నేనే! తెలుగు నేనే!

ఆ చల్లని సముద్ర గర్భం దృశ్య గీతాన్ని చూడండి👇


 గేయం:-

ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో
ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో 
                                                        ||ఆ చల్లని||

భూగోళం పుట్టుక కోసం రాలిన సుర గోళాలెన్నో
ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో
ఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నర కంఠములెన్నో
కుల మతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో                                                                                                                ||ఆ చల్లని||

మానవ కళ్యాణం కోసం పణమెత్తిన రక్తము ఎంతో
రణరక్కసి కరాళ నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో
కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో
భూస్వాముల దౌర్జన్యాలకు
ధనవంతుల దుర్మార్గాలకు
దగ్ధమైన బతుకులు ఎన్నో...
                                                       ||ఆ చల్లని||

అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరమో
కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో
పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో
గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో                                                                                                                    ||ఆ చల్లని||



నిరంకుశ నిజాము పాలన గురించి:-
ఓ నిజాము పిశాచమా, కానరాడు
నిన్ను బోలిన రాజు మాకెన్నడేని
తీగలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రతనాల వీణ
ఎముకల్ మసిచేసి పొలాలు దున్ని
భోషాణములన్ నవాబునకు
స్వర్ణము నింపిన రైతుదే
తెలంగాణము రైతుదే...

1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా...:-

ఆంధ్ర రాష్ట్రము వచ్చె
మహాంధ్ర రాష్ట్రమేరుపడువేళ
పొలిమేర చేరపిలిచె
నా తల్లి ఆనందం పంచుకుంది...!


        #తెలుగుసాహిత్యంలో మరియు మానవ మానసిక కోణంలో అజరామరమైన ఈ గేయాలు,గీతాలు,కణికలు అన్నియు మిమ్మల్ని గుర్తుచేస్తాయి...ఈ  నెల 22వతేదీ దాశరధి గారి జయంతికి శుభాకాంక్షలతో...🙏.

2 కామెంట్‌లు:

  1. ఈ గేయం విని చాలా ఏళ్ళయింది. బాగుందండీ. కొంతమంది యువకులు ముందుయుగం దూతలు, భావన నవజీవన నిర్మాతలు.అందరూ డబ్బు సంపాదించుకుంటూ కూర్చుంటే సాహిత్య సేవ ఎవరు చేస్తారు ? మీరు టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నారు. ముందుతరాలవారికి సాహిత్యం అందాలంటే ఎవరో ఒకరు మీలాగా "సమయం" త్యాగం చేస్తే మహద్భాగ్యమే !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హా మీరు మళ్ళీ శ్రీ శ్రీ మరో ప్రపంచం గుర్తుచేసేలా ఉన్నారు... ధన్యవాదాలు...🙏 నిహారిక గారు.
      సదా సాహిత్య సేవలో...మీ తెలుగోడు.

      తొలగించండి

Blogger ఆధారితం.